Hadith for the World
ఫజాయిల్

తౌహీద్ ప్రామఖ్యతలు

4 hadiths

4 hadiths

అబీ సయీద్ అల్ ఖుద్రీ మరియు అబీ హురైరహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక ముస్లింకు ఎలాంటి అలసట, అనారోగ్యం, చింత, దుఃఖం, హాని లేదా వేదన కలిగినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా - అల్లాహ్ అతని పాపాలలో కొన్నింటిని క్షమించి వేస్తాడు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : (ఒక ప్రయాణములో) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక వాహనముపై కూర్చుని ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఓ ముఆధ్ ఇబ్న్ జబల్”. దానికి ఆయన “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి “ఓ ముఆధ్!” అన్నారు. ఆయన తిరిగి “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి మూడవసారి కూడా అదే విధంగా జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే “సత్యపూర్వకముగా తన సంపూర్ణ హృదయముతో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మద ర్రసూలుల్లాహ్’ (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు) సాక్ష్యమిస్తాడో, అల్లాహ్ నరకాగ్నిని అతనిపై నిషేధిస్తాడు.” అది విని ముఆధ్ “ఓ రసూలుల్లాహ్! ఈ వార్తను నేను మిగతా వారందరికీ వినిపించనా, వారు సంతోషిస్తారు” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “వద్దు, అలా చేస్తే వారు ఈ ఒక్క దానిపైనే ఆధారపడతారు (అంటే మిగతా సత్కార్యాలు చేయడం పట్ల ఆసక్తి చూపకుండా)” అన్నారు. ముఆధ్ రజియల్లాహు అన్హు తన మరణశయ్యపై ఉండి ఈ హదీసును ఉల్లేఖించినారు – జ్ఞానాన్ని ఇతరులకు చేరవేయకుండా దాచుకున్న పాపమునకు తాను లోను కారాదనే భయంతో.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ము’ఆద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక ఒక గాడిద పై కూర్చుని ఉన్నాను. ఆ గాడిద పేరు ‘ఉఫెయిర్’. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు “ఓ ము’ఆద్! నీకు తెలుసా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటో, అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటో?” దానికి నేను “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికి మాత్రమే బాగా తెలుసు” అన్నాను. అపుడు ఆయన “నిశ్చయంగా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే, దాసులు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ ఆయనకు సాటి కల్పించరాదు. అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ కు ఎవరినీ సాటి కల్పించరో, అల్లాహ్ అలాంటి వారిని శిక్షించరాదు.” అన్నారు. నేను “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఈ శుభ వార్తను ప్రజలకు వినిపించవచ్చా?” అని అడిగాను. ఆయన “వారికీ శుభవార్తను వినిపించకు. అలా చేస్తే, వారు కేవలం దీని పైనే ఆధారపడి పోతారు” అన్నారు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించినాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఆ రెండు అనివార్యమైన విషయాలు ఏమిటి?” ఆయన ఇలా పలికినారు “అల్లాహ్ కు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని స్థితిలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. మరియు ఎవరైతే ఆయనకు సాటి కల్పిస్తున్న స్థితిలో మరణిస్తారో వారు నరకం లోనికి ప్రవేశిస్తారు".ముస్లిం నమోదు చేసినారు: